Saturday, 31 October 2020

పాకిస్థాన్ మొట్టమొదటి న్యాయశాఖ మరియు కార్మిక శాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ రాజీనామా లేఖ

 పాకిస్థాన్ మొట్టమొదటి న్యాయశాఖ మరియు కార్మిక శాఖా మంత్రి శ్రీ జోగేంద్రనాథ్ మండల్ రాజీనామా లేఖ

ఉపోద్ఘాతము :
జోగేంద్రనాథ్ మండల్ (29 జనవరి 1904-5 అక్టోబరు వంగ దేశస్థుడు. నేటి బంగ్లాదేశ్ లో జన్మించారు.
వంగదేశపు మేధావులలో ఒకరు. దళిత నాయకులు, ముస్లింల సహకారాన్ని కూడగట్టి డా|| భీంరావ్ రాంజీ అంబేద్కర్ ను వంగ ప్రాంతం నుంచి రాజ్యాంగ పరిషత్ కి ఎన్నికగావింప జేయటంలో కీలకపాత్ర వహించారు. ఆ తర్వాత ముస్లిం లీగ్ కు సహకరించి, బెంగాల్ విభజనకు, తద్వారా దేశవిభజనకు షెడ్యూల్డ్ కులాల వారి మద్దతును కూడ గట్టారు. పాకిస్థాన్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించటంతో పాటు పాకిస్థాన్ రాజ్యాంగసభకు అధ్యక్షుడిగా పనిచేశారు. పాకిస్థాన్ మొట్టమొదటి న్యాయశాఖ, కార్మికశాఖామంత్రిగా 1948 ఆగష్టు 15 నుండి అక్టోబర్ 8, 1950న రాజీనామా చేసే వరకు పనిచేసారు. కాశ్మీర్ వ్యవహారాలను సైతం పర్యవేక్షించారు
ఈయన తొలుత డా॥ అంబేడ్కర్ ముఖ్య సహచరులలో ఒకరు. అంబేద్కర్ తో కలిసి బెంగాలీ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్‌ను (SCF) నెలకొల్పారు. అయితే అంబేద్కర్ తో విభేదించి పాకిస్థాన్ లో దళితులకు భద్రత, సమాన అవకాశాలు ఉంటాయని నమ్మి, ముస్లింలీగ్ కు, ఆ తర్వాత పాకిస్థాన్ కు తిరుగులేని మద్దతుదారుగా నిలిచారు. మంత్రి ఉండడానికి పశ్చిమ పాకిస్తాన్ కు వలస వెళ్ళారు. మూడు సం||ల తర్వాత అక్కడ షెడ్యూల్డ్ కులాల వారితోసహా హిందువులందరిపై జరుగుతున్న అత్యాచారాలకు, అణచివేతకు గుండెపగిలి లియాఖత్ అలీ ఖాన్ 1950 అక్టోబర్ 8న తన రాజీనామా లేఖను పంపారు. ఆ లేఖకు తెలుగు అనువాద మిప్పుడు ఈ పుస్తక రూపాన వెలుగులోకి వస్తున్నది. తన జీవితపు చరమ దశలో భారతదేశానికి తిరిగి వచ్చి పశ్చిమ బెంగాల్ లో 1968లో మరణించారు.
గొఱే కసాయి వాడినే నమ్ముతుందని ఒక సామెత ఉంది.
బెంగాల్ ప్రాంతంలోని హిందువులు (బెంగాల్ ప్రాంతంలోని షెడ్యూల్డ్ కులాల వారిని నామ శూద్రులు అని వ్యవహరిస్తారు) మహాప్రాణ్ జోగేంద్రనాథ్ మండల్ నాయకత్వంలో నడచి పాకిస్థాన్ లో అంతగా ఇబ్బందులు ఉండని జీవితం గడపగలమనుకున్నారు. కాని స్వల్ప వ్యవధిలో ఘోర నరకాన్ని చవిచూశారు. వారుపడిన కష్టాలు, బాధలు, కేశాలు వర్ణనాతీతం.
తన కలలు చెదిరి వాస్తవం గ్రహించుకున్న మండల్ ఈ రాజీనామా లేఖ ద్వారా ఆ దుర్భర అనుభవాలలో కొన్నింటిని చరిత్ర కొరకు నమోదు చేశారు. దేశవిభజన ఎలాంటి పరిణామాలకు దారితీసిందో తెలిసికొనగోరేవారు దీనిని తప్పక చదవాలి.
@$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$@
ప్రియమైన ప్రధానమంత్రి గారికి,
తూర్పు బెంగాల్ కు చెందిన వెనుకబడ్డ హిందూ ప్రజలను ఉద్దరించాలనేది నా జీవన లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఘోరంగా విఫలమై, బరువెక్కిన హృదయంతో నిరాశా నిస్పృహలకు లోనై మీ మంత్రి మండలి నుండి రాజీనామా చేస్తున్నాను. ఉపఖండంలో ప్రస్తుతం నెలకొన్న చారిత్రాత్మక పరిస్థితుల్లో నా రాజీనామాకు దారితీసిన పరిస్థితులను సవివరంగా చెప్పటం సబబుగా ఉంటుందని భావించి ఈ లేఖ రాస్తున్నాను.
******************************************
1. ముస్లిం లీగ్ కు మద్దతు
*******************************************
నా రాజీనామాకు దారి తీసిన మూల కారణాలను వివరించే ముందు ముస్లిం లీగ్ తో నా సహకారం గురించిన నేపథ్యాన్ని వివరించటం అవసరమని నేను భావిస్తున్నాను. 1943 ఫిబ్రవరిలో ముస్లిం లీగ్ కు చెందిన కొందరు ప్రముఖ నాయకులు బెంగాల్ విధానసభలో నా సహకారాన్ని అర్థించారు. 1943 మార్చిలో ఫజుల్ హక్ మంత్రి వర్గం పడిపోయింది. షెడ్యూల్ కులాలకు చెందిన 21మంది శాసనసభ్యులతో నేను ముస్లింలీగ్ నాయకుడైన క్వాజా నజీముద్దీన్ కు సహకారం అందించటానికి అంగీకరించాను. దానితో 1943 ఏప్రిల్ లో ఆయన అధికారంలోకి వచ్చారు. నేను ముస్లింలీగ్ కు ఇచ్చిన సహకారం షరతులు లేనిది కాదు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ముగ్గురిని మంత్రులుగా నియమించాలని, ప్రతీ ఏటా ఐదు లక్షల రూపాయలు షెడ్యూల్డ్ కులాల వారి విద్యావ్యాప్తి కోసం గ్రాంట్ గా ఇవ్వాలని, ప్రభుత్వం నియామకాల్లో కులపరమైన కోటాను తు.చ.తప్పకుండా అమలు చెయ్యాలి అనేవి నా షరతులు. అందుకు వారు అంగీకరించారు.
ఈ షరతులను వారు అంగీకరించి నందువలననే కాక, ఇతర కారణాలవలన నేను ముస్లింలీగ్ కు సహకారం అందించాను. బెంగాల్ లో ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల వారీ వృత్తులు, ఆర్థిక అవసరాలు ఇంచుమించుగా ఒక్కటే. ఇరువర్గాలలోను రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు. ఇరు వర్గాల్లో కొందరు మత్స్యకారులు ఉన్నారు. ఇరువర్గాల వారు విద్య విషయకంగా బాగా వెనుకపడి ఉన్నారు. ముస్లింలీగ్ తో నా సహకారం వలన బెంగాల్ జనాభా అత్యధికులైన ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల వారి సంక్షేమం, సమృద్ధి కోసం పనిచేయవచ్చునని, పాలనాపరంగా, శాసనసరంగా అభివృద్ధి నిరోధకుల పునాదులను పెకిలించవచ్చునని నాకు నచ్చ జప్పారు. అంతేకాక, నా ఈ సహకారం వలన మత సామరస్యం నెలకొంటుందని హిందువులు, ముస్లింలు కలసి మెలసి జీవించవచ్చునని నాకు నచ్చచెప్పారు. దానితో నేను సహకారం అందించాను. నజీముద్దీన్ ఇచ్చిన మాట ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు చెందిన ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. మరో ముగ్గురిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాడు.
**************************************************
2. ప్రత్యక్ష చర్య' తరువాత కూడా కొనసాగిన సహకారం
***************************************************
1946 సాధారణ ఎన్నికల తరువాత పార్టీ నాయ కత్వంలో బెంగాలీ లీగ్ మంత్రివర్గం ఏర్పాటైంది. ఫెడరేషన్ టిక్కెట్ మీద నేను ఒక్కడినే షెడ్యూల్డ్ కులాలనుండి ఎన్నికైన వాడిని. నన్ను కేబినెట్ లోకి తీసుకున్నారు. 1946 ఆగష్టు 16న 'ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య' కు దిగింది. అది తీవ్ర మారణహోమానికి దారితీసింది. ముస్లిం గుండాలు హిందువు లను విచక్షణారహితంగా చంపారు. దానితో మంత్రివర్గం నుండి నన్ను రాజీనామా చెయ్యండని హిందువులు డిమాండ్ చేశారు. నాకు నిత్యమూ బెదిరింపులేఖలు వచ్చేవి. కాని నేను బెదిరింపులకు లొంగలేదు. రాజీనామా చెయ్యలేదు. నా విధానాలను అంటి పెట్టుకొని ముస్లిం లీగ్ కు సహకారం అందించాను. అంతేగాక నా పత్రిక 'జాగరణ' ద్వారా కాంగ్రెస్, ముస్లిం లీగ్ ల మధ్య జరుగుతున్న ఘర్షణలు దూరంగా ఉండమని షెడ్యూల్డ్ కులాల వారిని హెచ్చరించారు. 1946 అక్టోబర్ లో నవకాళిలో చెలరేగిన మతఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. వేలాది మంది హిందువులు ముస్లింలు నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. వందలాది మంది బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. వారిలో అనేకమంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అనేక మంది హిందూ స్త్రీలను చెరపట్టారు. మానభంగాలు చేశారు.
ఆస్తి నష్టం, ప్రాణనష్టం విపరీతంగా జరిగింది. మత సంఘర్షణలు జరిగిన ఈ ప్రాంతాలను నేను సందర్శించాను. హిందువులపై జరిగిన అత్యాచారాలు, అవమానాలు వర్ణనాతీతమైనవి. వారి బాధలు నన్ను బాగా కదిలించాయి. అయినా ముస్లింలీగ్ తో నా సహకారాన్ని కొనసాగించాను. కలకత్తాలో జరిగిన సామూహిక హిందూ హత్యాకాండ తరువాత సుహ్రవర్దీ మంత్రివర్గం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. నా ప్రయత్నంవలన 4 ఆంగ్లో ఇండియన్ సభ్యులు, కాంగ్రెస్ కు చెందిన షెడ్యూల్ కులాలవారైన 4 శాసనసభ్యులు ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆ తీర్మానం వీగిపోయింది.
**************************************************
3. మధ్యంతర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం
**************************************************
1946 అక్టోబర్ లో సుప్రవర్జీ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. కేంద్రంలో ఏర్పాటు చేయబోయే మధ్యంతర ప్రభుత్వంలో నాకు స్థానం ఇవ్వనున్నట్లుగా ఆయన చెప్పారు. నాకు ఆలోచించుకోవడానికి ఒక గంట సమయం మాత్రమే ఇచ్చారు. రాజీనామా చేసే స్వతంత్రం నాకు ఉండాలన్న షరతును పెట్టాను. ఎందుకంటే మా నాయకుడు డా || అంబేడ్కర్ అప్పుడు దేశంలో లేరు. ఆయన అనుమతి లేకుండా మంత్రివర్గంలో నేను చేరలేను. అదృష్టం కొద్దీ
డా || అంబేడ్కర్ లండన్ నుండి కేబుల్ ద్వారా తన సమ్మతిని తెలియజేశారు. మధ్యంతర ప్రభుత్వంలో చేరటానికి ఢిల్లీ వెళ్లేముందు సుహ్రవర్దీ ని కలిసి నా స్థానంలో షెడ్యూల్ కులాలకు చెందిన ఇద్దరిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొమ్మని, మరొక ఇద్దరిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించుమని కోరాను.
1946 నవంబరు 1న కేంద్రంలో మధ్యంతర ప్రభుత్వంలో చేరాను. ఒక నెల తరువాత కలకత్తా వచ్చినపుడు డజను సమావేశాల్లో ప్రసంగించి నామశూద్రులను (షెడ్యూలు కులాలవారిని) శాంతింపజేశాను. దానితో పెద్ద పెట్టున జరగవలసి ఉన్న ఘర్షణలు నివారింప పడ్డాయి. 1947 జూన్ 3న బ్రిటీషు ప్రభుత్వం దేశవిభజనకు ప్రతిపాదన చేసింది. దేశమంతటా హిందువులు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలీగ్ పాకిస్థాన్ డిమాండ్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కాంగ్రెసుతో బేరం ఆడటానికి, అధికారంలో ఎక్కువ ప్రాతినిధ్యంకోసం చేసిన డిమాండ్ గా నేను భావించానుసవర్ణ హిందువుల దురహంకారం, జాత్యభిమానంపట్ల ముస్లింలకు ఉన్న అనుమానాలు సరైనవని నేను అనుకున్నప్పటికీ, పాకిస్థాన్ ఏర్పాటువలన ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని నేను అనుకోలేదు. దేశ విభజన మత విద్వేషాలను మరింతగా పెంపు చేస్తుందని, దానివలన పాకిస్థాన్ ముస్లింల పరిస్థితులు మెరుగు పడేదేమీ ఉండదని, రెండు ప్రాంతాలలోని సామాన్యుల పేదరికం, నిరక్షరత పోవని, వారి దుర్భర జీవన పరిస్థితులు మెరుగుపడవని నేను భావించాను. పైపెచ్చు దేశ విభజన వలన పాకిస్థాన్ దక్షిణ ఆసియాలోని ఒక వెనుకబడ్డ దేశంలో, అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని దేశంలో మిగిలిపోతుందని నా నమ్మకం.
**************************************************
4. హామీల ఉల్లంఘన
**************************************************
షరియత్ కు, ఇతర ఇస్లామిక్ ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్ పేరున ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని నెలకొల్పుతారని నేను అప్పట్లో అనుకోలేదు. 1940, మార్చి 23న లాహోర్‌లో చేసిన తీర్మానం ప్రకారం పాకిస్థాన్ ఏర్పాటు అవుతుందని భావించి. దాని ప్రకారం వాయవ్యాన, తూర్పు ముస్లిం మెజారిటీ ప్రాంతాలలో రెండు స్వతంత్ర దేశాలు ఏర్పాటు చెయ్యాలి. ఈ దేశంలోని వివిధ ప్రాంతాలకు కూడా స్వతంత్ర సార్వభౌమాధికారం ఉంటాయి. అల్పసంఖ్యాకుల అభీష్టం మేరకు రాజ్యాంగంలో తగిన ప్రకరణాలు చేయ బడతాయి. నేను ఈ తీర్మానాన్ని నమ్మాను. అంతేకాక ఆగష్టు 11న రాజ్యసభ అధ్యక్షుడిగా మహమ్మద్ ఆలీ జిన్నా హిందువులు, ముస్లింలకు మధ్య తారతమ్యం చేయబోమని, అందరూ పాకిస్థానీయులేనని, మత ప్రాతిపదికన పౌరులను విభజించబోమని హామీ ఇచ్చారు. ఇస్లామిక్ రాజ్యం, ముస్లింల దయాదాక్షిణ్యాల మీద జిమ్మీలు ఆధారపడవలసిన పని లేదని అన్నా చెప్పిన హామీను నమ్మాను. అయితే ఇందులోని ప్రతి హామీని, ఇచ్చిన ప్రతి మాటను బహిరంగంగా మీ కళ్ళముందే ఉల్లంఘిస్తూ అల్పసంఖ్యాకులను అవమానం పాలు చేశారు. అభద్రతకు గురిచేశారు. అయినా మీరేమీ చెయ్యలేదు.
**************************************************
5. బెంగాల్ విభజన :
**************************************************
ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలి. బెంగాల్ విభజన నేను వ్యతిరేకించాను. బెంగాల్ విభజనకు అనుకూలంగా ఒక ఉద్యమం బయలుదేరినప్పుడు నేను అనేక అవమానాలకు గురిఅయ్యాను. హిందువులు భరించరాని తిట్లు, శాపనార్థాలు పెట్టారు. 32కోట్ల మంది హిందువులు వ్యతిరేకించినా కూడా పాకిస్థాన్ ప్రతిపాదనపట్ల నా విధేయత చెక్కుచెదరలేదు. పాకిస్థాన్ లోని 70 లక్షల మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు నా విన్నపాన్ని మన్నించినందుకు వారికి సర్వదా కృతజ్ణుడిని, వారు నాకు తిరుగులేని మద్దతును ప్రోత్సాహాన్ని ఇచ్చారు. 1947 ఆగష్టు 14న పాకిస్తాన్ ను ఏర్పాటు చేసిన తర్వాత మీరు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. నన్ను ఆ మంత్రివర్గం లోకి తీసుకున్నారు. క్వాజా నజీముద్దీన్ తూర్పు బెంగాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. ఆగష్టు 10న, కరాచీలో నజీముద్దీన్ ను కలసి ఇద్దరు మంత్రులను షెడ్యూల్డ్ కులాల నుండి తీసుకొమ్మని కోరాను. కొన్నాళ్ళ తరువాత అలాగే చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన విషయాలు అత్యంత విచారకరమైనవి. మీతోనూ, నజీముద్దీన్ తోనూ నురుల్ అమీన్ తోనూ అనేకసార్లు ఈ విషయమై ప్రస్తావన చేశాను. నజీముద్దీన్ షెడ్యూల్డ్ కులాలవారిని మంత్రివర్గంలోకి తీసుకొనే విషయమై తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తున్న విషయాన్ని గమనించి, పాకిస్తాన్ ముస్లింలీగ్ అధ్యక్షుడు, తూర్పు బెంగాల్ ముస్లింలీగ్ అధ్యక్షుడితోనూ మాట్లాడాను. మీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వచ్చాను. మీ నివాసంలో నజీముద్దీన్ నా ఎదుటి మీరు మాట్లాడారు. ఢాకా వెళ్ళగానే కనీసం ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటానని ఆయన చెప్పారు. ఒక నెల లోపలే షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒకరిని తీసుకొంటామని హామీ ఇచ్చారు. కానీ అలా జరగలేదు. బహుశా మీరు చెప్పింది వేరు You did not mean what you said. నజీముద్దీన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. నురుల్ అమీన్ ఆ తర్వాత తూర్పు బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యాక, తిరిగి ఆయనవద్ద ఈ విషయం ప్రస్తావించాను. ఆయన స్పందన కూడా అలాగే ఉంది. నేను తిరిగి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మీరు నాకు హామీ ఇవ్వటమేకాక రెండు మూడు పేర్లు ఇమ్మని అడిగాడు. ముగ్గురి పేర్లు మీకు పంపాను. ఢాకా నుండి మీరు తిరిగివచ్చిన తర్వాత మిమ్మల్ని కలసి విషయం ప్రస్తావిస్తే "నూరుల్ అమీన్ ను ఢిల్లీ నుంచి తిరిగి రానివ్వండి" అని అన్నారు. కానీ ఆ తరువాత
ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అనేకసార్లు మీకు ఈ విషయమై విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
**************************************************
6. హిందూ వ్యతిరేక విధానం
**************************************************
బెంగాల్ విభజన ప్రతిపాదన కార్యరూపం దాలు తున్నప్పుడు షెడ్యూల్డ్ కులాల వారు విభజన వల్ల జరిగే ప్రమాదం గురించి ఆందోళన చెందారు. అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి నుప్రవర్దీ దృష్టికి వారి భయాలు ఆందోళనలను తెస్తే వారు ఒక పత్రికా ప్రకటన చేశారు. అప్పటివరకు షెడ్యూల్డ్ కులాల వారు అనుభవిస్తున్న హక్కులు, సదుపాయాలు విభజన అనంతరం కూడా కొనసాగటమేకాక, అదనపు హక్కులు, సదుపాయాలుకూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని ఆయన వ్యక్తిగత హోదాతో పాటు, లీగ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా ఇచ్చారు. కానీ ఏ విషయంలోనూ పాకిస్థాన్ లో షెడ్యూల్డ్ కులాలవారికి న్యాయం జరగలేదు, మీకు జ్ణప్తి ఉండే ఉంటుంది. అడపాదడపా షెడ్యూల్డ్ కులాలవారి బాధలు, ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొని వస్తూనే ఉన్నాను. తూర్పు బెంగాల్ లో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంది కూడా మీ దృష్టికి తెచ్చిన ముఖ్యంగా తూర్పు బెంగాల్ పోలీసుల అసమర్థత, అశ్రిత పక్షపాతం, హిందూ వ్యతిరేకత గురించి నేను తీవ్రమైన ఆరోపణలను మీ దృష్టికి తెచ్చాను. ఎందుకూ కొరగాని అల్పమైన అంశాల ఆధారంగా చేసుకొని వారు హిందువులు కాలుదువ్వే వారు. వారి పట్ల దారుణంగా ప్రవర్తించారు. తూర్పు బెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలగురించి మీకు విడమర్చి చెప్పాను.
**************************************************
7. హిందువులపై అత్యాచారాలు :
**************************************************
గోపాల్ గంజ్ కు సమీపంలోని ఒక గ్రామంలో ఒక ముస్లిం ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా, స్థానిక నామశూద్రుల పై దారుణ అత్యాచారాలు చేశారు. వాస్తవంగా జరిగింది వేరు. ఒక ముస్లిం తన బోటులో వెళుతూ చేపలు పట్టేందుకు వల విసిరాడు. ఆ సరికే అదే పనిలో అదే చోట నిమగ్నమై ఉన్న ఒక నామ శూద్రుడు ఇందుకు అభ్యంతరం చెప్పారు. దానితో ఆగ్రహించిన ఆ ముస్లిం పక్కనున్న ముస్లిం గ్రామానికి వెళ్ళి ఫిర్యాదు చేశాడు.
అదే సమయంలో గోపాల్ గంజ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ బోటు లో ప్రయాణం చేస్తూ అటుగా వచ్చాడు. నిజానిజాలు విచారించకుండా ఆ నామ శూద్రుడ్ని, పట్టి తెమ్మని పోలీసులు పంపాడు. పోలీసులు, కొందరు ముస్లింలు నామ శూద్రుల ఇళ్లపై దాడిచేసి, ఆడవాళ్ళని మగవాళ్ళని చిత్తుగా కొద్ది దోచుకొని ఇళ్ళు తగలబెట్టారు. ఒక నిండు గర్భవతిని విచక్షణారహితంగా కొట్టడంతో, ఆమెకు అక్కడే గర్భస్రావం అయింది. దారుణమైన ఈ చర్యకు స్థానికులు భయాందోళనలకు గురి అయ్యారు.
ఇలాంటి దారుణ సంఘటన 1949లో బారిసాల్ జిల్లాలో జరిగింది. స్థానిక పంచాయితీలో రెండు వర్గాల మధ్య చిన్న తగాదా జరిగింది. ముస్లిం వర్గం వారు రెండవ వర్గాన్ని పోలీసుల సహాయంతో దెబ్బకొట్టాలనుకొన్నారు. దానితో పోలీస్ స్టేషన్ పై ప్రత్యర్థి వర్గాల వారు దాడి చేశారని ఫిర్యాదు ఇచ్చారు. ఆ తప్పుడు ఫిర్యాదు అంగీకరించి, జిల్లా కేంద్రం నుండి అదనపు బలగాలను రప్పించి, హిందువుల ఇళ్ళపై దాడిచేసి, వారిని తీవ్రంగా హింసించారు. వారి విలువైన వస్తువులను కొల్లగొట్టారు. ఊళ్ళోలేని వారి ఇళ్లను, రాజకీయాల్లో ఎప్పుడూ లేనివారి ఇళ్ళను సైతం దోచు కున్నారు. హైస్కూలు విద్యార్థులను అనేకమందిని కమ్యూనిస్టు సానుభూతిపరులుగా ముద్రవేసి, వారిని అనవసరంగా హింసించారు. ఆ గ్రామం నా స్వంత గ్రామానికి దగ్గరగా ఉండటంతో అక్కడివారు నాకు ఫిర్యాదు చేశారు. నిష్పక్ష విచారణ జరపమని జిల్లా అధికారులకు వ్రాశాను. స్థానికులు కూడా విచారణ జరపమని కోరారు. కాని ఏమీ జరగలేదు.
నా ఉత్తరం అధికారులకు చేరినట్లుగా కూడా వారు జవాబు ఇవ్వలేదు. ఆ తర్వాత నేను పాకిస్థాన్లో అత్యున్నత అధికారి అయిన (ప్రధానమంత్రి) మీ దృష్టికి తెచ్చాను. కాని న్యాయం జరగలేదు.
**************************************************
8. పాక్ సైనికులు అత్యాచారాలు :
**************************************************
స్లీటు జిల్లాలో హర్ బింగర్ షెడ్యూల్డ్ కులాల వారికి హిందువులపై జరిగిన అత్యాచారం గురించి సవివరంగా చెప్పాలి. అమాయకులైన మగవారిని, ఆడవారిని దారుణంగా చిత్రహింసల పాలు చేశారు. పోలీసులు, ముస్లింలు హిందువుల ఇక పై దాడి చేసి దోచుకునేవారు. అడ్డువచ్చే వారిని కొట్టేవారు. మిలటరీ పోలీసులు అక్కడ నియమించారు. అణచివేతకు వారు మారుపేరు. శాంతిభద్రతలు కాపాడాల్సిన వారే హిందువుల ఇళ్ల పై పడి దోచుకున్నారు. వారి స్త్రీలపై కన్ను వేసి రాత్రి సమయంలో తమ దగ్గరకు తమ కోర్కెలు తీర్పు కొనేందుకు పంపమని బలవంతం పెట్టారు. లొంగకపోతే దారుణంగా కొట్టేవారు. ఎంతోమంది స్త్రీలను వారు మానభంగం చేశారు. ఈ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మీరు దానిమీద విచారణకు ఆదేశించి ఒక నివేదికను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఏ విచారణ జరగలేదు. ఏ నివేదిక బయటకు రాలేదు. రాజషాహి జిల్లాలో ఒక గ్రామంలో ఒక సంఘటన జరిగింది. కమ్యూనిస్టులు అన్న నెపంతో పోలీసులు, స్థానిక ముస్లింలు హిందువుల ఆస్తిపాస్తులను దోచుకున్నారు సంతాల్ లు సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్ లో వచ్చి జరుగుతున్న దారుణాలు గురించి ప్రపంచానికి తెలియజేసారు.
**************************************************
9. అనాథలైన హిందువులు :
**************************************************
ఖుల్నా జిల్లాలో 1949 డిసెంబర్ 20న ఒక దారుణ సంఘటన జరిగింది. కమ్యూనిస్టులను వెతికే నెపంతో పోలీసు బృందం ఒక ఇంటిపై దాడి చేసింది. సమాచారం పొక్కటంతో ఇంటి యజమానితో ఉన్న కొందరు యువకులు ఇంట్లో ఉండకుండా దూరంగా వెళ్లారు. పోలీసులు ఇంటిపై దాడి చేసి గృహస్థు భార్యను నిర్బంధించారు. ఆమె ఏడుపు విని ఇంటి యజమాని, మిగిలిన యువకులు తిరిగి వచ్చి పోలీసులు దాడి చేశారు. వారు కొట్టిన దెబ్బలకు ఒక పోలీసు అక్కడికి ప్రాణాలు విడిచాడు. ఈలోగా మిగిలిన ఇద్దరు పోలీసులు పరుగెత్తి ఇరుగుపొరుగు ఉన్న ముస్లింల సహాయం అడిగారు. చనిపోయిన కానిస్టేబుల్ ను తీసుకొని పోలీసులు వెళ్లిపోయారు. ఖుల్నా జిల్లా పోలీసు అధికారి ఆ మర్నాడు మధ్యాహ్నానికి పెద్ద బలగంతో ఆ ఊరికి వచ్చాడు. దాడి చేసిన యువకులు వారి ఇరుగు పొరుగువారు ఊరు విడిచి వెళ్ళారు. అయితే మిగిలిన జనాభా వారి ఇళ్ళలో ఉన్నారు. ఏమి జరుగుతుందో తెలుసుకొనే లోపల ముస్లింలు పోలీసుల సహాయంతో ఇళ్ళల్లో చొరబడి దోచుకున్నారు. దేవీదేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. అనేకమందిని చంపారు. బలవంతంగా కొందరిని ముస్లింలు గా మార్చారు. మహిళలను మానభంగం చేశారు
నామ శూద్రులు ఆధిక్యంగా నివసించే ఆ గ్రామంలోనే కాక, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సైతం క్షణాల్లో నరకం సృష్టించారు.
ఫిబ్రవరి 28, 1950న నేను ఆ గ్రామాలను సందర్శిం చాను. జిల్లా అధికారులు, ముస్లింలీగ్ నాయకులు నాతో ఉన్నారు. ఒక గ్రామంలో 350 ఇళ్ళకుగాను మూడు ఇళ్ళే మిగిలాయి. మిగిలిన ఇళ్ళను, వారి నాటు పడవలను ద్వంసం వేశారు. నామశూద్రుల పశువులను తోలు కెళ్ళారు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి ప్రధానమంత్రికి ఈ వివరాలు అన్నీ చెప్పారు.
ఆ గ్రామాలలో జరిగిన కారణాల గురించిన వార్తలు పశ్చిమ బెంగాల్ పత్రికలలో రావడం తో హిందువులు అశాంతికి, ఆగ్రహానికి గురియ్యారు. ఆ గ్రామాలకు చెందిన బాధితులకు అనేకమంది అనాధలయ్యారు. వారిలో కొందరు కలకత్తా వచ్చి వారి గోడును వెళ్లబోసుకున్నారు. వారి బాధ మిగిలిన వారిని కదిలించటంతో పశ్చిమ బెంగాల్ లో మత సంఘర్షణలు జనవరిలో చెలరేగాయి.
**************************************************
10. హిందువులపై ప్రతీకార దాడులు :
**************************************************
1950 ఫిబ్రవరిలో ఢాకాలోనూ, తూర్పు బెంగాల్ లో ఇతర ప్రాంతాలలోనూ మర సంఘర్షణలు పెద్ద పెట్టున చెలరేగాయి. ఫిబ్రవరి రెండవ వారంలో కాంగ్రెస్ సభ్యులు రెండవ సావధాన తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరారు. కాని అనుమతిని ఇవ్వలేదు. దానితో వారు నిరసనగా శాసనసభ నుండి బయటకు వెళ్ళారు. హిందూ ప్రతినిధుల ఈ చర్య ముస్లింనేతలతో పాటుగా ముస్లిం ప్రజలకు కూడా ఆగ్రహం తెప్పించింది.ఢాకాలో మత సంఘర్షణలకు ఇదే కారణం.
1950 ఫిబ్రవరి 10న ఉదయం 10 గంటల సమయంలో ఒక స్రీకి ఎర్రరంగు పులిమి ప్రదర్శించారు. ఆమె వక్షోజాలను కలకత్తా మత సంఘర్షణలో తెగగొట్టారని చెప్తూ తూర్పు బెంగాల్ సెక్రటేరియట్ చుట్టూ తిప్పారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ బయటకు వచ్చి హిందువులపై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేశారు. ఒక మైలు దూరం నడవగానే జనంతో ఊరేగింపు నిండి పోయింది. విక్టోరియా పార్కులో 12 గంటలకు హిందువులకు వ్యతిరేకంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఆశ్చర్యకర మైన విషయమేమిటంటే ఆ సమయంలో అదే భవనంలో ఉభయ బెంగాల్ లో ఉద్రిక్తత తగ్గించేందుకు చేపట్టవలసిన చర్యలు గురించి చర్చిస్తున్నారు.
**************************************************
11. దోపిడీదారులకు వత్తాసుగా అధికారులు :
**************************************************
మధ్యాహ్నం ఒంటిగంటకు ఢాకారాజధాని అంతటా ఘర్షణలు మొదలయ్యాయి. హిందువులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. వారి షాపులను లూటీ చేశారు. ఇళ్ళను తగులబెట్టారు. అడ్డుకున్న వాళ్ళని చంపేశారు. మహిళలను మానభంగం చేశారు. రాజధానిలో అన్ని ప్రాంతాలలోను లూటీలు, హత్యలు మానభంగాలు పతాక స్థాయిలో జరిగాయి. అధికారులు ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారు. హిందువుల పై దాడిని నివారించటానికి బదులుగా, వారికి వత్తాసు పలికారు. అంతేకాకుండా మార్గదర్శకం కూడా చేశారు. దురదృష్టవశాత్తు నేను ఢాకా సాయంత్రం 5 గంటలకు చేరుకోగలిగాను. జరిగిన విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూశాను. నేను చూసింది, విన్నది హృదయ విదారకంగాను, భయభ్రాంతులకు గురిచేసేదిగాను ఉంది.
**************************************************
12. ఘర్షణల నేపథ్యం :
**************************************************
1. తూర్పు బెంగాల్ అసెంబ్లీలో హిందూ ప్రతినిధులు మతఘర్షణలపై సావధాన తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి, అందుకు అనుమతి నిరాకరించడం లో వారు సభనుండి బయటకు వెళ్ళటాన్ని ముస్లిం బిగ్ జీర్ణించుకోలేక పోయింది. హిందూ ప్రతినిధుల ప్రజాస్వామిక హక్కు వారి ఆధిపత్యానికి ధిక్కారంగా వారు భావించారు.
2. ముస్లింలీగ్ సభ్యులలో సుహ్రవర్దీ వర్గానికి, నజీముద్దీన్ వర్గానికి మధ్య ఉన్న విభేదాలతో అధికారంలో ఉన్న వర్గాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రత్యర్థివర్గం హిందువులపై దాడులకు రెచ్చగొట్టారు.
3. బెంగాల్ ఏకీకరణకు కొందరు హిందువులు, ముస్లింలు పూనుకొంటున్నారన్న వార్తలు ముస్లిం లీగ్ అభద్రతా భావానికి గురిచేశాయి. దాన్ని మొగ్గలోనే ప్రతిఘటించాలని అనుకొన్నారు. తూర్పు బెంగాల్ లో హిందువులపై దాడులు జరిగితే, అది పశ్చిమ బెంగాల్లో ముస్లింలపై దాడులకు దారి తీస్తుంది కనుక హిందూ, ముస్లింల మధ్య ఐకమత్యానికి భంగం వాటిల్లి ఉమ్మడి బెంగాల్ ఉద్యమానికి మద్దతును దెబ్బతీయవచ్చని ముస్లింలీగ్ భావించింది.
4. బెంగాల్ ముస్లింలకు, బెంగాల్ యేతర ముస్లింలకు విభేదాలు పెరుగుతున్నాయి. దీన్ని నిరోధించే ముస్లింలు అందర్నీ ఒక తాటి మీదకు తీసుకొని రావాలంటే హిందువులు, ముస్లింలు మధ్య చిచ్చుపెట్టాలి. భాషాసమస్య కూడా దీనితో ముడిపడి ఉంది.
5. భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు సన్నగిల్లుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ముందు పట్టణ ప్రాంతాలలో తర్వాత గ్రామీణ ప్రాంతాలలో పడింది. ముస్లిం ప్రజలను ఈ సమస్యనుండి దృష్టి మళ్ళించటానికి హిందువుల పై జీహాద్ ను ప్రకటించారు.
**************************************************
13. కళ్ళు తిరిగే వాస్తవాలు-10 వేల మంది మృతి:
**************************************************
ఢాకాలో నేను 9 రోజులు ఉన్నాను. ఘర్షణలు చెలరేగిన అన్ని ప్రాంతాలు పర్యటించాను. కానీ, దాని పరిసర ప్రాంతాలకు వెళ్ళాను. మీరాపూర్ వెళ్ళాను. అమాయకులైన వందలాది హిందువులను రైళ్ళలో పట్టుకొని చంపివేశారు.
ఢాకా, నారాయణగంజ్, ఢాకా-చిట్టగాంగ్ మధ్య నడుస్తున్న రైళ్లలో ఈ దారుణాలు చేశారు. మత సంఘర్షణలు చెలరేగిన రెండవ రోజున తూర్పు బెంగాల్ ముఖ్యమంత్రిని కలసి ఘర్షణలు అదుపు చేయండి, ఇతర ప్రాంతాలకు ప్రాకకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వండని కోరారు. ఫిబ్రవరి 20, 1950న బారిసాల్ పట్టణానికి వెళ్ళాను. అక్కడి పరిస్థితులు నా గుండెను పిండివేశాయి. కాశీపూర్, లకూటియా, మధబ్ పాషాలు జిల్లా కేంద్రానికి 6 మైళ్ళ పరిధిలో ఉన్నాయి. ఆ ప్రాంతాలు చేరటానికి మోటారు వాహనాలు వెళ్ళగలిగే రహదారులు కూడా ఉన్నాయి. ఒక్క మధబ్ పాషా జమిందారు ఇంట్లోనే 300 మందిని పైగా చంపారు. 40మందిని గాయపరిచారు. ములాదీ అనే చోట భయంకరమైన నరకాన్ని సృష్టించారు. ములాదీ బందర్ లో ఒక్కచోటనే 300 మందిని పైగా చంపారు. ములాది గ్రామంలో శవాల గుట్టలు కన్పించాయి. కుక్కలు, ఇతర జంతువులు శవాలను నదీ తీరం దగ్గర పీక్కొని తింటున్నాయి.
మగవాళ్ళందర్నీ చంపిన తర్వాత, ఆడపిల్లలు ముస్లిం రజాకార్లు వాళ్ళలో వాళ్ళు పంచుకొన్నారు. పోలీసు ఠాణాకు రాయివేటు దూరంలో ఉన్న హిందువుల ఇళ్ళను సైతం యథేచ్చగా లూటీ చేశారు. ఇళ్ళను తగులబెట్టారు. హిందు వులను గుర్తించి, పట్టుకొని చంపారు. ఒక బారిసాల్ జిల్లాలోనే 2,500 మందిని పైగా చంపివేశారు. ఢాకా, దాని పరిసర ప్రాంతాలతో కలిపి 10,000 మందికి పైగా నిర్దాక్షిణ్యంగా చంపారు. నేను విచారంతో శోకించాను. తమ సర్వస్వం పోగొట్టుకొన్న స్త్రీ, పిల్లలను చూసి నేను క్రుంగిపోయాను.నన్ను నేను ప్రశ్నించుకొన్నాను. "ఇస్లామ్ పేరుతో పాకిస్థాన్ కు ఏమి రానున్నది?"
**************************************************
14. ఢిల్లీ ఒప్పందాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధి లేదు :
**************************************************
మార్చిలో పెద్ద పెట్టున హిందువులు తూర్పు బెంగాల్ వదలి పశ్చిమ బెంగాల్ వలస వెళ్ళడం మొదలు పెట్టారు. కొద్దికాలంలోనే హిందువులందరూ తూర్పు బెంగాల్ ను ఖాళీ చేసేటట్లుగా కనపడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక జాతీయ విపత్తు ఏర్పడనుంది. అయితే ఏప్రిల్ 8న ఢిల్లీలో భారత్-పాక్ ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దానినే ఢిల్లీ ఒప్పందం అంటారు తూర్పు బెంగాల్ అంతా విస్తృతంగా పర్యటించి, వలస పోగా మిగిలిన హిందువులు ధైర్యం చెప్పే పనిచేశాను. తమ స్వంత ఊళ్ళు,ఇళ్ళు వదలి వలస వెళ్ళవద్దని హితవు చెప్పాను.
ముస్లింలీగ్, తూర్పుబెంగాల్ ప్రభుత్వం ఢీల్లీ ఒప్పందాన్ని చిత్త శుద్ధితో అమలు చేస్తారని ఆశించాను. కాని తూర్పు బెంగాల్ ప్రభుత్వానికి ఒప్పందాన్ని అమలుచేసే ఉద్దేశమే లేదు అందుకోసం ఎట్టి యంత్రాంగాన్ని అది ఏర్పాటు చేయలేదు. తమ తమ గ్రామాలకు తిరిగి వచ్చిన హిందువులు వారి స్వంత ఇళ్ళను వారికి ఇవ్వలేదు. తరతరాలనుండి అనుభవిస్తున్న వారి స్వంత భూములను వారికి ఇవ్వలేదు.ఇళ్ళను, భూములను ముస్లింలు ఏనాడో కబ్జా చేశారు.
**************************************************
15. మౌలానా అక్రమ్ ఖాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
**************************************************
ముస్లిం లీగ్ నాయకుల ఉద్దేశ్యాలకు సంబంధించి నా అనుమానాలు నిజమయ్యాయి. పాకిస్థాన్ అల్ప సంఖ్యాక శాఖ మంత్రి తన రేడియో ప్రసంగంలో - "ప్రవక్త మహమ్మద్ సైతం యూదులకు అరేబియాలో స్వేచ్ఛను ఇచ్చారు అని చెప్పాడు. " ప్రాంత ముస్లింలీగ్ అధ్యక్షుడైన అక్రమ్ ఖాన్ తన పత్రిక 'మొహమ్మద్' వైశాఖి సంచికలో సంపాదకీయంలో ఈ విధంగా వ్రాశారు. "డా|| మాలిక్ (అల్పసంఖ్యాకశాఖా మంత్రి)" తన ప్రసంగంలో అరేబియాలో యూదులు గురించి ప్రస్తావించక పోయి ఉంటే బాగుండేది. మహమ్మద్ యూదు లకు స్వేచ్ఛను ఇచ్చిన మాట నిజమే. కాని చరిత్రలో ఇది మొదటి అధ్యాయం. కాని చివరి అధ్యాయంలో మహమ్మద్ ఇచ్చిన ఆదేశం భిన్నంగా ఉంది. “ఆయన యూదులను అరేబియా నుంచి బహిష్కరించమని ఆదేశాలు ఇచ్చాడు." ఆ సంపాదకీయం చదివిన తర్వాత కూడా నూరుల్ అమీన్ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే పనిచేస్తుందని నేను ఆశించాను. కాని నా నమ్మకం వమ్ము అయింది. నురుల్ అమీన్ డి.ఎన్. బరారిని మైనారిటీలకు ప్రతినిధిగా మంత్రివర్గంలోకి తీసుకున్నాడు.
**************************************************
16. నురుల్ అమీన్ ప్రభుత్వం కపటం:
**************************************************
నేను ఒక పత్రికా ప్రకటన చేశాను. డి.ఎన్. బరారిని మంత్రివర్గంలోకి తీసుకోవటంద్వారా తూర్పు బెంగాల్ మైనారిటీలకు ఎలాంటి ఊరట కలుగదని, అంతేకాక ఆయన చేరికతో నురుల్ అమీన్ ప్రభుత్వం మీద ఉన్న అన్ని భ్రమలు తొలగిపోయాయని ప్రకటించాను. ఎందుకంటే నూరుల్ అమీన్ ప్రభుత్వానికి ఢిల్లీ ఒప్పందాన్ని అమలు చేయాలన్న ఉద్దేశం లేదు. డి.ఎన్. బరారి ఎవరికీ ప్రతినిధి కాడు. ఆయనకు ఆయనే ప్రతినిధి. కాంగ్రెస్ పార్టి టికెట్ మీద గెలిచి తూర్పు బెంగాల్ శాసనసభ సభ్యుడయ్యాడు.
షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ (SCF) మొదటి నుంచి వ్యతిరేకించాడు. కొన్నాళ్ళ తర్వాత కాంగ్రెస్ ను వీడి, ఫెడరేషన్ లో చేరాడు. మంత్రిగా నియమించ బడ్డాడు. కనుక ఫెడరేషన్ సభ్యత్వాన్ని కోల్పోయాడు. తూర్పు బెంగాల్ హిందువులు నాతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను, పూర్వాపరాలు, వ్యక్తితం, మేధో పటిమను పట్టి చూస్తే బరారి హిందువుల ప్రతినిధిగా ఢిల్లీ ఒప్పందంలో భాగంగా మంత్రి అయ్యేందుకు అర్హత లేనివాడు. నేను ఇద్దరి పేర్లను నురుల్ అమీన్కు సూచించాను. వారు ముగ్గురు వారి వారి రంగాలలో నిష్ణాతులు, ఒకరు ఢాకా హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్‌ (SCF) కు ఉపాధ్యక్షులు, నాలుగు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా వారికి ఉంది. రెండవ వారు శాసన మండలి లో 7 సంవత్సరాలపాటు సభ్యులుగా ఉన్న అనుభవం ఉన్నవారు. వారుకూడా న్యాయవాదే. ఆ ఇద్దరు పెద్దమనుషులను కాదని మూడవవ్యక్తిని ఎందుకు మంత్రిగా నియమించారో తెలియదు. నేను ఖచ్చితంగా చెప్పగలను. బరారిని మైనారిటీ మంత్రిగా నియమించటం ఢిల్లీ ఒప్పందం స్ఫూర్తికే విరుద్ధం. అల్పసంఖ్యాకులలో అభద్రతాభావాన్ని పోగొట్టి వారు తూర్పు బెంగాల్ లో నివాసం కొనసాగించటానికి, వారి ఆస్తి పాస్తులకు, మానప్రాణాలకు, మతానికి భద్రత కల్పించటమే ఢిల్లీ ఒప్పందం లక్ష్యం.
**************************************************
17. హిందువులు తరిమికొట్టటమే ప్రభుత్వ విధానం :
**************************************************
నేను ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నాను. హిందువులు తరిమికొట్టాలనే ఉద్దేశంతోనే తూర్పు బెంగాల్ ప్రభుత్వం పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీతో మాట్లా డుతూ ఒకటి రెండుసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాను కూడా, పశ్చిమ పాకిస్థాన్ నుండి హిందువులను బలవంతంగా వెళ్ళగొట్టారు. ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ నుంచి కూడా హిందువులు వెళ్ళగొట్టుతున్నారు. హిందువులను తరిమి కొట్టటమనే ప్రక్రియలో చివరి అంకం ఇప్పుడు నడుస్తున్నది. పాకిస్థాన్ తన హిందూ మైనారిటీలకు భద్రత కల్గించటంలో విఫలం అయింది. ఇస్లామిక్ రాజ్యస్థాపన దిశగా పాకిస్థాన్ పరుగులు తీస్తున్నది. హిందూ మేధావులను వారు వదిలించుకోదల్చుకున్నారు. ఎందుకంటే వారివలన పాకిస్థాన్ రాజకీయ ఆర్థిక సామాజిక జీవనాలు ప్రభావితం కాకూడదని వారు అనుకుంటున్నారు.
**************************************************
18. ఉమ్మడి నియోజకవర్గాల ఏర్పాటుకు వ్యతిరేకత:
**************************************************
నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ఎందుకు ఇంతవరకు నిర్ణయించలేదో నేను అర్థం చేసుకోలేక పోతున్నాను. అల్పసంఖ్యాకవర్గ సబ్ కమిటీ మూడుసార్లు భేటీ అయింది. ఉమ్మడి నియోజకవర్గాలు ఉండాలా, ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలా అన్న ప్రశ్నను పరిష్కరించలేదు. పాకిస్థాన్ లో గుర్తించబడ్డ మైనారిటీల ప్రతినిధులు ఉమ్మడి నియోజకవర్గాల వైపు మొగ్గు చూపారు. వెనకబడ్డ అల్పసంఖ్యా కులకు కొన్ని నియోజకవర్గాలను కేటాయించాలని వారు కోరుకున్నారు. ఆగస్టులో జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. కాని ఎట్టి చర్చ జరగకుండానే సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డది. పాకిస్థాన్ పాలకులు ఇలాంటి ముఖ్యమైన అంశంపై నిర్ణయం తీసుకోవటంలో జాష్యం చేయటం ఏ ఉద్దేశంతో చేస్తున్నారో అర్థం చేసుకోవటం కష్టం ఏమీ కాదు.
**************************************************
19. హిందువుల భవిష్యత్తు అగమ్యగోచరం :
**************************************************
హిందువుల భవిష్యత్తు తూర్పు బెంగాల్ లో ఆగమ్య గోచరంగా కన్పిస్తుంది. ఢిల్లీ ఒప్పందంవలన ఎలాంటి ప్రయోజనమూ కలుగలేదు. హిందువులు ఏమాత్రం ఆశావాహస్థితిలో లేదు. సమీప భవిష్యత్తు అంతా అంధకార మయం.
తూర్పు బెంగాల్ హిందువుల ఆత్మవిశ్వాసం పునరుద్దరించ బడదలేదు. తూర్పు బెంగాల్ ప్రభుత్వం ముస్లిం లీగ్ ఢిల్లీ ఒప్పందాన్ని కేవలం ఒక చెత్త కాగితంగా వారు చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు వలస వెళ్లిన అనేక మంది షెడ్యుల్ కులాలకు చెందిన రైతులు తూర్పు బెంగాల్ తిరిగి రావటానికి కారణం వారికి తూర్పు బెంగాల్ ప్రభుత్వం పై నమ్మకం కుదిరి కాదు. కాందిశీకుల శిబిరాలలో ఎన్నాళ్ళో తలదాచుకోలేక కొందరు, వారికున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులను తెగనమ్ముకొని తిరిగి హిందూస్థాన్ వెళ్ళేందుకు మరికొందరు తిరిగివస్తున్నారు. తూర్పు బెంగాల్ లో తీవ్రమైన మతఘర్షణలు ఈ మధ్యకాలంలో జరగక పోవటానికి కారణం ఢిల్లీ ఒప్పందం అమలు కావటం కాదు. ఒప్పందం ఉన్నా లేకపోయినా ఘర్షణలు ఎల్లకాలం కొనసాగవు. ఒప్పందం చేసుకోవటమే లక్ష్యం కాదు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడుతున్న వివాదాలను, భేదాభిప్రాయాలను పరిష్కరించుకొనేందుకు అనువైన పరిస్థితులను సృష్టించటమే అసలు ఒప్పందం లక్ష్యం. కాని ఒప్పందం అమలు అయిన ఈ ఆరునెలల్లో ఏ ఒక్క వివాదమూ పరిష్కారం కాలేదు. ఏ భేదాభిప్రాయం పరిష్కరించబడలేదు. అంతేకాక మత దురహంకారంతో హిందూ వ్యతిరేక, భారత్ వ్యతిరేక ప్రచారాన్ని పాకిస్థాన్ ఇంటాబయటా పెద్ద పెట్టున కొనసాగిస్తున్నది. కాశ్మీర్ దినాన్ని పాకిస్థాన్ అంతటా ఎంతో ఆర్భాటంగా నిర్వహించటం పాకిస్తాన్ భారత వ్యతిరేక ప్రచారానికి నిదర్శనం. పంజాబు గవర్నర్ ఇటీవల మాట్లాడుతూ భారత్ లో ముస్లింల రక్షణకోసం పాకిస్థాన్ కు పెద్ద సైనిక శక్తిగా అవతరించటం అవసరమన్న సందేశం పాకిస్తాన్ అసలు ఉద్దేశ్యాలను బయట పెట్టుకుని. రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణాన్ని అది మరింత ఎక్కువ చేస్తుంది.
**************************************************
20. తూర్పు బెంగాల్ లో ప్రస్తుతం ఏం జరుగుతుంది?
**************************************************
తూర్పు బెంగాల్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? దేశ విభజన తర్వాత 50 లక్షల మంది హిందువులు తూర్పు బెంగాల్ విడిచి వెళ్ళారు. నిన్న జరిగిన మతఘర్షణలవల్ల మాత్రమే కాదు. ఇంకా ఇతర కారణాలవల్ల కూడా హిందువులు దేశం విడిచి వెళుతున్నారు. హిందూ లాయర్లను, వైద్యులను వ్యాపారస్థులను, వర్తకులను ముస్లింలు ఒక పద్ధతి ప్రకారం బాయ్ కాట్ చేస్తున్నారు. దానితో జీవనోపాధి మృగ్యమై మనుగడ కోసం దేశం విడిచి వెళ్తున్నారు. హిందువుల ఇళ్ళను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకోవటంతో వారు దిక్కులేని వారు అవుతున్నారు. హిందువుల ఇళ్ళల్లో అద్దెకు ఉన్న ముస్లింలు అద్దెలు చెల్లించటం లేదు. హిందూ భూస్వాములకు కౌలు చెల్లించటం ఆగిపోయి చాలా రోజులు అయ్యింది.రజాకర్ల మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. హిందువుల భద్రతకు రక్షణకు వారు పెద్ద ముప్పుగా మారారు. విద్యావిషయాలలో జోక్యం, ఇస్లామీకరణకు చేసే ప్రయత్నాల వల్ల విద్యా సంస్థలు బెదిరిపోతున్నాయి.వారందరూ తూర్పు బెంగాల్ వదలి వెళుతున్నారు. సెకండరి పాఠశాలలకు ఒక ఉత్తర్వు ఇచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఖురాన్ పాటించాలని ఉత్తర్వులిచ్చారు. పాఠశాల భవనాలకు జిన్నా, ఇక్బాల్ లియాకత్ అలీ, నజీముద్దీన్ మొదలైన ముస్లిం ప్రముఖుల పేర్లు మాత్రమే పెట్టాలని తాఖీదు ఇచ్చారు. 1500 ఉన్నత పాఠశాలలో కేవలం 560 మాత్రమే పనిచేస్తున్నాయి.
వైద్యుల వలస కారణంగా రోగులకు సరైన వైద్యసహాయం అందటం లేదు. హిందూ పురోహితులందరూ దేశంవిడిచి ఎప్పుడో వెళ్ళిపోవడంతో ముఖ్యమైన హిందూ ఆరాధనా కేంద్రాలు అన్నీ మూతపడ్డాయి. పెండ్లిళ్ళు, పబ్బాలు జరిపించేందుకు పురోహితులు లేరు. దేవీదేవతా విగ్రహాలు తయారుచేసే కళాకారులు లేరు. హిందూ మెజారిటీ ఉన్న గ్రామాలలోనూ, ముస్లింలే బలవంతంగా గ్రామ పంచాయతీ లకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. హిందూ ప్రధాన ఉపాధ్యాయులు, కార్యదర్శుల స్థానే ముస్లింలే కూడబలుక్కుని బలవంతంగా పదవులను లాక్కొన్నారు. కొందరు హిందూ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారిదగ్గర పనిచేసే క్రిందస్థాయి ముస్లిం ఉద్యోగులు పదోన్నతి పొంది వారికే అధికారులయ్యారు. కొందరు హిందూ ఉద్యోగులను ఉద్యోగాలనుండి బలమైన కారణం లేకుండానే తొలగించారు. చిట్టగాంగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ కారణం లేకుండానే ఆ పదవి నుంచి ఇటీవల తొలగించారు.
**************************************************
21. హిందువుల సాంఘిక బహిష్కరణ
**************************************************
హిందువుల ఇళ్ళకు దోచుకోవటం, వారిని యథేచ్ఛగా వేధించటం, హింసించటం ఎప్పటిలాగానే కొనసాగుతున్నది. పోలీసు స్టేషనులలో హిందువులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోరు. హిందూ కన్యలను అపహరించటం, మాన భంగం చెయ్యటం తగ్గిపోయింది. ఎందుకంటే 12-30 సంవత్సరాల మధ్య వయసుగల హిందూ సవర్ణ కన్యలు ఎవరూ ఇప్పుడు తూర్పు బెంగాల్ లో లేదు. వెనకబడ్డ కులాల చెందిన హిందూ కన్యలు వారి తల్లిదండ్రులతో ఉంటుంది వారిని ముస్లిం గుండాలు వదలటం లేదు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆడపిల్లలపై మానభంగాలు కొదవలేదు. ముస్లిం గుండాలు తమ ఆడపిల్లలను వేధిస్తున్నారన్న అనేక ఫిర్యాదు నాకు అందాయి
ముస్లిం కొనుగోలుదారులు హిందూ రైతుల దగ్గర నుండి ఏ ఉత్పత్తులు కొన్నా వాటి విలువలు కొంత భాగాన్నే చెల్లిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించేందుకు లేదు. పాకిస్థాన్ లో న్యాయం, ధర్మం అనే దానికి అర్థాలు వేరు. ముస్లింలకు ఒక న్యాయం. హిందువులు మరొక న్యాయం. హిందువులు ఎప్పుడూ రెండవ తరగతి పౌరులే.
**************************************************
22. పశ్చిమ పాకిస్థాన్ లో బలవంతపు మత మార్పిళ్ళు :
**************************************************
పశ్చిమ పాకిస్తాన్ లో సైతం పరిస్థితులు మెరుగ్గా లేవు. సింధు రాష్ట్రంలో ఒక లక్షమంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఉన్నారు. దేశవిభజన తర్వాత పశ్చిమ పంజాబులో వేలాదిగా ఉన్న షెడ్యూల్డ్ కులాల వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ముస్లిం గుండాలు అపహరించిన ప్రతి 12 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన బాలికలలో నలుగురిని మాత్రమే తిరిగి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. మిగిలిన వారి అతీగతీ తెలియదు. వారి పేర్లు, వారిని అపహరించిన వారి వివరాలు కూడా అధికారులకు ఇవ్వటం జరిగింది.
తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లు చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేదు. అపహరించిన ఆడపిల్లలను పట్టుకొనేం దుకు నియమించబడ్డ అధికారి ఒక చిత్రమైన జవాబు ఇచ్చారు. అపహరించబడ్డ హిందూ కన్యలు, స్త్రీల జాడ తెలుసుకోవటం తన బాధ్యత అని, షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలు హిందువులు కాదు కాబట్టి వారి జాడ తెలుసు కోవలసిన బాధ్యత తనది కాదని పేర్కొన్నాడు. కరాచీలో నివసిస్తున్న హిందువుల జీవితాలు దయనీయంగా ఉన్నాయి.
కరాచీ, సింధ్ లో 363 దేవాలయాలు, గురు ద్వారాలు ముస్లింల ఆధీనంలోనే ఇంకా ఉన్నాయి. కొన్ని దేవాలయాలు మాంసం కొట్లుగా, మరికొన్నింటిని జంతు వధశాలలుగా మార్చారు. ఏ ఒక్క దేవాలయాన్ని, గురు ద్వారాన్ని వారు తిరిగి హిందూ, సిక్కు స్వంతదారులకు ఇవ్వలేదు.
హిందువులు భూములను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ముందస్తుగా ఎటువంటి నోటీసుకూడా ఇవ్వలేదు. ముస్లిం కాందిశీకులుకు, స్థానిక ముస్లింలకు ఆ భూములను ఇచ్చారు. మూడు వందల మంది హిందువులు స్థానికులే అని పేర్కొన్నా, వారికి చెందవలసిన వారి ఆస్తిపాస్తులను, ఇళ్ళను, భూములను వారికి ఇవ్వలేదు. ప్రసిద్ధి చెందిన కరాచీ గోశాలను సైతం దాని ధర్మకర్తలకు స్వాధీనం చెయ్యలేదు. అపహరించబడ్డ తమ కూతుళ్ళు, భార్యల గురించి అనేకమంది దురదృష్టవంతులైన తల్లిదండ్రులు, భర్తలనుండి నాకు అనేక ఫిర్యాదులు కరాచీనుండి వచ్చాయి. వారిలో అనేకులు షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు. ప్రభుత్వం దృష్టికి వారి దుస్థితిని తీసుకొని వెళ్ళాను. కాని ప్రభుత్వం వారి ఫిర్యాదులను పట్టించుకోలేదు. సింధు రాష్ట్రంలో నివసిస్తున్న అనేకమంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఇది నాకు ఎంతో విచారాన్ని కలుగ జేసింది.
****************************
23. పాకిస్థాన్ హిందువుల పాలిటి శాపం
****************************
నా ఉద్దేశ్యం ప్రకారం పాకిస్థాన్ హిందువులు "స్టేట్ లెస్" అయ్యారు. వారి స్వంత దేశంలో, స్వంత ఇళ్ళలో ఉన్నప్పటికీ వారిని పౌరసత్వం లేని వాళ్ళు మార్చారు. వారి తప్పు హిందువులుగా బ్రతకగోరటమే. ముస్లింలీగ్ నాయకులు పాకిస్థాన్ ఇస్లామిక్ మతరాజ్యమని, ఇస్లామిక్ మతరాజ్యంగానే ఉంటుందని పదేపదే ప్రకటిస్తున్నారు. అన్ని సమస్యలకు పరిష్కారంగా ఇస్లామ్ ను చూపిస్తున్నారు. పెట్టుబడిదారీ సామ్యవాద వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా ఇస్లామిక్ వ్యవస్థను తీసుకొని వస్తున్నారు. 'ఇస్లామిక్ సమానత్వం, 'సౌభ్రాతృత్వం ప్రత్యామ్నాయంగా అనుసరించే మార్గాలుగా చెప్తున్నారు.
షరియత్ అనుసరించి పాలనచేసే ఆ ఇస్లామిక్ వ్యవస్థలో ముస్లింలు ఎప్పుడూ పరిపాలకులుగా ఉంటారు. హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలు జిమ్మీ, పాలితులు, వారికి భద్రత కావాలనుకుంటే అందుకు మూలం చెల్లించవలసిందే. ఆ మూల్యం ఏమిటో ప్రధానమంత్రిగా మీకు బాగా తెలుసు.
ఎన్నో చూసిన దానిమీదట, విన్నదానిమీదట, చదివింది మీదట, ఎంతో ఆందోళనకు, ఘర్షణకు లోనయిన పిమ్మట ఒక స్థిరమైన అభిప్రాయానికి నేను వచ్చాను. పాకిస్థాన్ లో హిందువులకు అనువైన నెలవు కాదు. హిందువులకు పాకిస్తాన్ స్థానం లేదు. ఇక్కడ ఉన్న హిందువులను బలవంతంగా మతం మార్చుతారు. అందుకు వారు ప్రతిఘటిస్తే వారిని నిర్దాక్షిణ్యంగా ఈ లోకంలోనే లేకుండా చేస్తారు. దశలవారీగా ఇక్కడ సమీప భవిష్యత్తులో జరగబోయేది ఇదే. సవర్ణ హిందువులు అధిక సంఖ్యాకులు తమ స్వంత గడ్డను, ఇళ్ళను, ఆస్తిపాస్తులను వదిలివేసి, కాందిశీకులుగా హిందూస్థాన్ పారిపోయారు. షెడ్యూల్డ్ కులాలకు చెందినవారిలో ఏ మాత్రం రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు కూడా అదే పని చేశారు. హిందువుల గతి పాకిస్థాన్ లో అధోగతే.
మీలాంటి విద్యావంతుడు, అనుభవజ్ఞుడు ప్రధానమంత్రిగా ఏలుతున్న కాలంలోనే ఇంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. మానవాళికి ముప్పు కలిగించే ఒక సిద్ధాంతాన్ని అన్ని రకాల సమానత్వ సూత్రాలను బేఖాతరు చేస్తూ ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని మీరు ప్రవచించటం, అమలు చేయటం అమానుషం. దురన్యాయం. మీకు, మీతోటి కార్యకర్తలకు చెప్తున్నాను. హిందువులు వారి మాతృభూమిలోనే జీమ్మీలుగా వ్యవహరింపబడటానికి గత్యంతరం లేక అంగీకరించవచ్చు. భయంతో, విచారంతో వారి ఇళ్ళను, పుట్టిన గ్రామాలను వదలి వెళ్ళిపోవచ్చు. కాని రేపు న్యాయమైన వారి హక్కుల కోసం తప్పక ఉద్యమిస్తారు. భవిష్యత్తులో ఏమి జరగనున్నదో ఎవరికి తెలుసు. నేను పాకిస్థాన్ ప్రభుత్వంలో కొనసాగటంవల్ల హిందువులకు ఎటువంటి మేలు జరగదని తేటతెల్లమయ్యాక నేను ఇక్కడ ఉన్న హిందువులు కాని, వెలుపల ఉన్న హిందువులు కాని తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు. హిందువులు పాకిస్థాన్‌ లో గౌరవంతో బ్రతక గల్గుతారని, వారి ఆస్తినిగాని ధన, మాన, ప్రాణాలకు గాని, అతనికి, ధర్మానికి గాని ఎటువంటి భంగం కలుగదనే తప్పుడు సంకేతాలు ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అట్లా ఇవ్వటానికి నా అంతరాత్మ ఒప్పుకోదు.
**************************************************
24. ముస్లింలకు కూడా పౌర స్వేచ్ఛ లేవు
**************************************************
పాకిస్థాన్ లో ముస్లింలు కూడా పౌర స్వేచ్ఛ లేవు. సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఆయన సోదరుడైన డా|| ఖాన్ సాహెబ్ కు ఏమి జరిగింది? వాయవ్య ప్రాంతానికి చెందిన అనేకమంది ముస్లిం నాయకులు, తూర్పు ప్రాంతానికి చెందిన ముస్లిం నాయకులతోపాటు జైళ్ళలో మ్రగ్గుతున్నారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సుప్రమర్డీ ఇప్పుడు పాకిస్థాన్ లో ఒక ఖైదీ మాదిరిగా బ్రతుకుతున్నారు. ఆయన ఎక్కడకు వెళ్ళాలన్నా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయన వల్లనే అవిభక్త భారతదేశంలో బెంగాలీ ముస్లిం లీగ్ అధికారాన్ని చేజిక్కించుకొన్నది. ఆయన ఎక్కడ పెదవి విప్పి ఇప్పుడు మాట్లాడరు. లాహోర్ తీర్మాన రచయిత డా|| ఫజల్ హుక్ దిక్కులేనివాడయి ఢాకా హైకోర్టులో కేసులు ఎదుర్కొంటున్నాడు. తూర్పు బెంగాల్ ముస్లింల గురించి ఎంత తక్కువ చెపితే అంత మంచిది. లాహోర్ లో బెంగాల్ ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉంటుదన్న హామీ ఇచ్చారు. సర్వసత్తాక స్వతంత్ర విభాగాలు రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేస్తామని హామీని ఇచ్చారు. దానికి బదులుగా వారికి ఏమి వచ్చింది?
తూర్పు బెంగాల్ పాకిస్థాన్ వలస ప్రాంతం అయింది. పాకిస్థాన్ లో మిగిలిన అన్ని ప్రాంతాలకంటే జనాభా తూర్పు బెంగాల్ లోనే ఎక్కువ. కాని కరాచీ పాలకులకు తూర్పు బెంగాల్ ఊడిగం చేస్తున్నది. పశ్చిమ పాకిస్థాన్ వారి ఆదేశాలను కిమ్మనకుండా అమలుచేస్తున్నది. పాకిస్థాన్ లో తూర్పు బెంగాల్ ప్రజలు అత్యుత్సాహంతో విలీనం అయ్యారు. వారి జీవనం మెరుగుపడుతుందని, సిరిసంపదలు పెరుగు వారి తాను ఆశించిన వారికి దొరికింది. సింధు, పంజాబు ప్రాంతాల ఎందుకూ పనికిరాని రాళ్ళు మాత్రమే. ఇస్లామిక్ పేట్, షరియత్ నిగూఢ పనితనం కారణంగా వారికి దొరికింది మట్టి, రాళ్ళు మాత్రమే.
**************************************************
25. విషాదకర చేదు అనుభవం:
**************************************************
పాకిస్థాన్, దాని యొక్క క్రూరత్వం, హిందువులపట్ల వివక్ష అందరికీ తెలిసినవే. నా వ్యక్తిగత అనుభవం సైతం అత్యంత విచారకరం. విషాదగ్రస్తం కూడా. చేదు అనుభవాలు నా గుండె బరువెక్కింది. అయితే ఆ అనుభవం నా కళ్ళు తెరిపించింది.
ప్రధానమంత్రిగా సెప్టెంబరు 8న ప్రకటన ఇమ్మని నన్ను అడిగారు. మీ మాట కాదనలేక మీ మంత్రివర్గ సభ్యుడిగా మీకు అనుకూల ప్రకటన ఇచ్చాను. కాని అసత్యాలు అర్ధసత్యాల తో కూడిన ప్రకటనలు ఇవ్వటానికి నా మనస్సాక్షి ఒప్పుకోదని మీకు తెలుసు. అయితే మీ మంత్రివర్గ సహచరుడిగా ఉన్నంత వరకు మీ అభ్యర్థనను తిరస్కరించిన. ఎల్లకాలం నేను ఈ భారం మోయలేను. అసత్యాలతో నా అంతరాత్మను నేను మోసం చేయలేను. అందుకే నా రాజీనామా పత్రాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. జాప్యం లేకుండా దాన్ని మీరు అంగీకరిస్తారని ఆశిస్తాను.
నాకు మీరు న్యాయశాఖ మంత్రిగా పదవిని ఇచ్చారు. మంత్రిత్వ శాఖను మీరు కొనసాగించవచ్చు. లేదా రద్దు చేయవచ్చు. లేదా మీ ఇస్లామిక్ స్టేట్ లక్ష్యాలను అనుగుణంగా మార్పు చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మీకు ఉంటుంది.
ఇట్లు
జోగేంద్రనాథ్ మండల్
(తెలుగు సేత : డా బి.సారంగపాణి)
Ref :
Resignation letter of Jogendra Nath Mandal to Liaquat Ali Khan in English

No comments:

Post a Comment

Ambedkar hated Rajah for throwing him into a quandary.

https://swarajyamag.com/amp/story/politics%2Frajah-moonje-pact-the-forgotten-model-for-social-justice-and-integration-of-dalits There was a...